కలం, యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం (Yadagirigutta) లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వర్తక సంఘం గుత్తాధిపత్యాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో దేవస్థానం డిప్యూటీ ఈఓ నవీన్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వర్తక సంఘం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ.. గత 30–40 ఏళ్లుగా కొండపై ఒకే వర్గానికి చెందిన వర్తక సంఘం దళారీ వ్యవహారాలు చేస్తూ భక్తులను దోపిడీ చేస్తోందని ఆరోపించారు.
కొబ్బరికాయలు, బొమ్మల షాపులకు ఓపెన్ టెండర్లు నిర్వహించకుండా రాజకీయ ప్రభావంతో అధికారులను ప్రభావితం చేస్తూ దేవస్థాన ఆదాయానికి గండికొడుతున్నారని మండిపడ్డారు. దేవస్థానం (Yadagirigutta) ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటే, వర్తక సంఘానికి మాత్రం అలాంటి పరిమితులు లేవని, తాతల నుంచి కొడుకుల వరకు వారసత్వంగా షాపులు నిర్వహిస్తూ ఇతరులకు అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
కొబ్బరికాయలను రూ.100కి, నీటి సీసాలను రూ.40కి విక్రయిస్తూ భక్తులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ కిరాయికి షాపులు తీసుకుని, వాటిని ఇతరులకు సబ్ లీజులకు ఇచ్చి నెలకు రూ. 50 వేల వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లేక వలస వెళ్తున్న పరిస్థితుల్లో, వర్తక సంఘం నాయకులు దేవస్థాన వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అన్ని షాపులకు ఓపెన్ టెండర్లు నిర్వహిస్తే దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వర్తక సంఘంలో నిజంగా పేదలు ఉంటే వారికి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. అధికారులు స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

