కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ‘సాదా బై నామా’ క్రమబద్ధీకరణ అంశంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. కొనుగోలుదారులు మాత్రమే డిక్లరేషన్ లేదా అఫిడవిట్ ఇస్తే సరిపోతుందన్నారు. దరఖాస్తుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను దఖలుపరిచినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇండ్లపై రివ్యూ సందర్భంగా ఈ అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ గతంలో విక్రయదారుడి డిక్లరేషన్ కూడా తీసుకునే విధానం ఉండేదని, దాన్ని సరళతరం చేసినట్లు తెలిపారు. భూ వివాదాల అంశాన్ని ప్రస్తావిస్తూ, భూసర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. ఐదు మండలాలలో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరును కూడా కేటాయిస్తున్నామని తెలిపారు.
దీర్ఘకాలంగా దరఖాస్తులు పెండింగ్‌లోనే :
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాదా బై నామాల క్రమబద్ధీకరణ జరుగుతుందని ఎదురుచూసిన ప్రజలకు పలు చిక్కులు ఎదురయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని (2014 జూన్ 2) కటాఫ్ డేట్‌గా గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీకి ముందు తెల్లకాగితాల మీద రాసుకున్న ఒప్పందాలకు మాత్రమే క్రమబద్ధీకణ వర్తించనున్నది. పట్టాలు మంజూరు కానున్నాయి. రాష్ట్రం మొత్తం మీద సుమారు 9.20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాల భూమి క్లియర్ కానున్నది. పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ప్రభుత్వం ఇటీవలే రివ్యూ చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సడలించింది. లావాదేవీల తేదీ: 2014, జూన్ 2 కంటే ముందు జరిగిన భూ విక్రయ ఒప్పందాలకు (సాదాబైనామాలకు) మాత్రమే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. గత ప్రభుత్వం 2020 అక్టోబరు 12 – నవంబరు 10 మధ్యకాలంలో దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ దరఖాస్తులను మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు పరిగణనలోకి తీసుకోనున్నది.
హైకోర్టు స్టే ఎత్తివేతతో లైన్ క్లియర్ :
అప్పటి నుంచీ అప్లికేషన్లు ప్రాసెస్ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో లీగల్ చిక్కులు ఏర్పడ్డాయి. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత 2025 ఆగస్టులో హైకోర్టు ఈ స్టేను ఎత్తివేసింది. దీంతో ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. దరఖాస్తుల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. భూమి కొన్నవారితో పాటు అమ్మినవారు కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనను సవరించి కొనుగోలుదారు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నది. ఈ దరఖాస్తుల్లోని వివరాల ఆధారంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ భూమి కనీసం 12 ఏళ్లుగా కొనుగోలుదారు అధీనంలో ఉంటేనే పట్టా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సాదాబైనామా కాగితాలపై ఇరు వర్గాల మధ్య లేదా వారసుల మధ్య వివాదాలు ఉంటే రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకోలేని రీత్యా సివిల్ కోర్టులు డిసైడ్ చేయనున్నాయి. ప్రైవేట్ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించే క్రమబద్ధీకరణ అసైన్డ్ భూములు, ప్రభుత్వ, చెరువు శిఖం భూములకు వర్తించదు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. అధికార వికేంద్రీకరణ చేయనున్నట్లు స్వయంగా మంత్రి వివరించారు. జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతీ వారం సమీక్ష జరపాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని, ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసేందుకు ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోనివారు, ఇప్పుడు దరఖాస్తుకున్నా అర్హత ఉంటే మంజూరు చేస్తామని తెలిపారు.
అప్లై చేసిన తర్వాత వెనక్కిపోతే మరొకరికి చాన్స్ :
ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని స్క్రూటినీలో లబ్ధిదారులుగా జాబితాలో చేరిన తర్వాత వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేమనే నిర్ణయం తీసుకున్నా, ఇల్లు అవసరం లేదని భావించినా వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని మంత్రి సూచించారు. ఇంటి బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు మంజురు చేశాక, వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మంచినీరు, కరెంటు, డ్రైనేజి వంటి మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ‘జీ ప్లస్ వన్’ పద్ధతిలో నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు.

