మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

కలం, కరీంనగర్ బ్యూరో: గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని సీపీ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 81 ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 40.173 కిలోల ఎండు గంజాయితో పాటు 26 గంజాయి మొక్కలను న్యాయస్థానం అనుమతితో ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ధ్వంసం చేసినట్లు తెలిపారు.

న్యాయాధికారుల సమక్షంలో కేసు ప్రాపర్టీ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల కోసం నమూనాలు సేకరించిన అనంతరం, కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ ఇన్‌సినిరేటర్స్‌లో గంజాయిని దహనం చేసినట్లు పేర్కొన్నారు. ధ్వంసం చేసిన గంజాయి, గంజాయి మొక్కల మొత్తం విలువ సుమారు రూ.17,09,000 ఉంటుందని సీపీ వివరించారు.

గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. అక్రమ లాభాల కోసం గంజాయి సాగు, రవాణా, నిల్వ, సరఫరా, విక్రయాలు నిర్వహిస్తూ యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు స్థానిక పోలీసులు, స్పెషల్ డ్రగ్ కంట్రోల్ టీమ్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయించే లేదా సేవించే వారి వివరాలను పోలీసులకు అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించే వారిపైనా చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, జైపూర్ ఏసీపీ ఎ.వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఎస్‌ఐ వినీత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>