కలం, కరీంనగర్ బ్యూరో: భారత ప్రభుత్వం 2026 ఆగస్టు 3న ప్రకటించిన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా భారతీయ జీవిత బీమా సంస్థ (LIC)లో తన వాటాను మరో 6.5 శాతం తగ్గించే నిర్ణయం జాతి వ్యతిరేకమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (AIIEA) విమర్శించింది. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నాలో యూనియన్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి వామన్ రావు మాట్లాడారు.
2022 మేలో LIC IPO ద్వారా 3.5 శాతం వాటా తగ్గించిన తరువాత దేశంలోని అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ ఆర్థిక సంస్థలో ప్రజల యాజమాన్యాన్ని మరోసారి మార్కెట్కు అప్పగించడంలో ఇది మరో అడుగు తెలిపారు. ఇది ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధత నుంచి వెనక్కి తగ్గుతున్నదనే విషయాన్ని సూచిస్తోందని చెప్పారు. LIC కేవలం లాభదాయక సంస్థ మాత్రమే కాదని, కోట్లాది పాలసీదారుల విశ్వాసం, పొదుపులతో నిర్మితమైన జాతీయ సంస్థ అని తెలిపారు.
దేశంలో గృహ పొదుపులను సమీకరించడం, దేశ నిర్మాణానికి నిధులు అందించడం, ప్రతి ప్రాంతానికి జీవిత బీమా సేవలను విస్తరించడంలో LIC అపూర్వమైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రతిపాదిత OFSను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే తీవ్ర ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్న ఎల్ఐసి లో వెంటనే నియామకాలు చేపట్టాలని, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం FDI ని ఉపసంహరించుకోవాలని AIIEA విన్నపించింది.
పాత పెన్షన్ విధానాన్ని అందరికీ అమలు చేయాలని వామన్ రావు డిమాండ్ చేశారు. LIC, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య శక్తులు, కార్మిక సంఘాలు, పాలసీదారులు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపుచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ నాయకులు రామ్మోహన్రావు, సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, బ్రాంచ్ 1 నాయకులు డి శ్రీనివాస్, బి శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.

