కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) స్పష్టం చేశారు. బుధవారం స్థానిక శేషగిరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతమైన జిల్లాలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఎయిర్పోర్ట్ నిర్మాణం, పోస్టాఫీసు అనుసంధానంగా పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల నూతన నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చడంతో పాటు రూ.10 కోట్లతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కేంద్రీయ విద్యాలయం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అలాగే, మణుగురు పీకే ఓసీ డిప్ బ్లాక్ ప్రైవేటు పరం కాకుండా సింగరేణి సంస్థకే దక్కడం హర్షణీయమని, ఇది సీపీఐ, ఏఐటీయూసీ ఐక్య పోరాట ఫలితమేనని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.
సింగరేణి పరిరక్షణకు, కొత్తగూడెం ప్రాంతంలో నూతన ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా సంస్థ మనుగడకు మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, సీతారామ ప్రాజెక్టు ద్వారా గరిష్ట ఆయకట్టుకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి బుధవారం ‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ, కార్మిక సంఘాల నాయకులు ఎస్.కే. సాబీర్ పాషా, కొరిమి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

