‘క్యూర్’లో ఇందిరమ్మ ‘ఎల్‌ఐజీ’ ఇళ్లు: మంత్రి పొంగులేటి

కలం, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ‘ఇందిరమ్మ ఇళ్లు’ స్కీమ్‌ను పట్టణాల్లోని పేద కుటుంబాలకూ విస్తరించేలా కార్యాచరణ మొదలైంది. ‘క్యూర్’ (కోర్ అర్బన్ రీజియన్) ప్రాంతంలో ఈ నెల 20 నుంచి ఇందిరమ్మ ఎల్‌ఐజీ (లోయర్ ఇన్‌కమ్ గ్రూప్) ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు. సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, సీఎం ఆలోచనలకు అనుగుణంగా ‘క్యూర్’ పరిధిలో దశలవారీగా లక్ష ‘ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ అయినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానంపై పూర్తి వివరాలను అదే రోజు వెల్లడిస్తామన్నారు.

ఈ సంవత్సరం లక్ష ఇండ్ల నిర్మాణం టార్గెట్ :

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్యను వెయ్యి వరకు పెంచుతామన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నగరానికి దూరంగా ఉన్నాయని, ఈ కారణంగా పేదలు ఉపాధి, ఉద్యోగాలు, పిల్లల చదువు, రవాణా ఇబ్బందులతో నివసించలేకపోయారని పేర్కొన్నారు. పేద కుటుంబాల జీవన పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ భూమిలో వాటా కల్పించడం ద్వారా లబ్ధిదారులకు యాజమాన్య హక్కు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కూడా లభిస్తుందన్నారు. ‘క్యూర్’ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అవసరమైన ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఆ భూములను హౌసింగ్ శాఖ స్వాధీనంలోకి తీసుకున్నదని, ఎక్కడ ఎన్ని ఇళ్లు నిర్మించాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ప్లాట్ల విస్తీర్ణం, భవనాల నమూనాలు వంటి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>