కలం, వెబ్ డెస్క్: ఏపీలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని.. దీంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. రాజమండ్రిలో శనివారం క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గృహ ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను గృహ ప్రదర్శన వేదికగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని.. ఈ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు.
నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చేపడుతోందని మంత్రి తెలిపారు. నిర్మాణ రంగాన్ని డెవలప్ చేసేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌తో అనేక అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని.. దీంతో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు.
అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ.. దేశంలోని తొలి ఐదు ప్రముఖ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. తమ ప్రభుత్వం 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో పర్యాటక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు, రహదారులు, ఇతర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.

