కలం, యాదగిరిగుట్ట : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని బీఆర్‌ఎస్‌వీ (BRSV) మండల అధ్యక్షుడు ఒగ్గు మల్లేష్ అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, మట్టి, ఇసుక వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలపై(Asset Allegations) సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.
యాదాద్రి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుని వందల ఎకరాల్లో వెంచర్లు చేసి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి లేని సమయంలో మారుతి 800 కారులో తిరిగిన అయిలయ్యకు ప్రస్తుతం బీఎండబ్ల్యూ, మూడు ఫార్చునర్ కార్లు, ఖరీదైన డిఫెండర్ వాహనం, నాలుగు హిటాచీలు, పది టిప్పర్లు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులు ఎలా సమకూరాయో ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని మల్లేష్ కోరారు. తాను చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువజన విభాగం జనరల్ సెక్రటరీ మొగిలిపాక పృథ్వీరాజ్, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు దొడ్డి వినయ్, గౌడ కరుణాకర్, ఒరుగంటి శ్రీధర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

