కలం, వెబ్డెస్క్: అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒహియో (Ohio) రాష్ట్రంలో శ్రీ స్వామినారాయణ వడ్తాల్ ధామ్ ఆలయం (Swaminarayan Temple)పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహాత్మా గాంధీ జయంతి, అలాగే ఒహియో హిందూ హెరిటేజ్ మంత్ ప్రారంభమైన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆలయంపైకి దుండగులు ఇటుకలు విసరడంతో భవనం తీవ్రంగా ధ్వంసమైంది. కిటికీలు, తలుపులకు ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్థానికంగా ఉండే హిందూ అమెరికన్లపై పెరుగుతున్న ద్వేషపూరిత ఘటనల్లో ఇది కూడా ఒకటని భావిస్తున్నామని ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొంది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్వేషం పెరుగుతోందని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమని తెలిపింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై ఎఫ్బీఐ అధికారులను అప్రమత్తం చేశామని, ఆలయ బాధ్యులతో సంప్రదింపులు జరుపుతూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. నిందితులను వెంటనే పట్టుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే భారతీయ, హిందూ అమెరికన్లపై వస్తున్న ద్వేషపూరిత ప్రచారాన్ని దేశాధినేతలు, ప్రభుత్వ ఏజెన్సీలు ముక్త కంఠంతో ఖండించాలని డిమాండ్ చేస్తున్నాయి.

