కలం, వెబ్ డెస్క్: కార్పొరేట్ విద్యా సంస్థలు రాజ్యమేలుతున్న సమయంలో సర్కారు పాఠశాల్లో (Govt Schools) విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, బడులను కాపాడేందుకు కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరుతున్నారు. ఇలాగే ఏపీలోని ఓ బడిలో తమ సొంత ఖర్చులతో చిన్న చిన్న వీడియోలు రూపొందించుకొని ప్రభుత్వ బడిలో నెలకొన్న సౌకర్యాలు వివరిస్తూ బడిలో చేర్పించాలని కోరుతున్న ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లు పోసి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వమని, చానళ్లలో యాడ్స్ కూడా వేయించుకోమని చెప్పారు. ప్రభుత్వ బడిలో సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులే తమ బలమని స్పష్టం చేశారు. పిల్లలకు కల్పించే భద్రత, సమగ్ర విద్యా వికాసం కోసం తీసుకుంటున్న చర్యలు, వారి భవిష్యత్తుకు కల్పించే భరోసా గురించి మాత్రమే చెబుతామని పేర్కొన్నారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలంటూ వినూత్న ప్రచారం చేస్తోన్న టీచర్లను అభినందిస్తున్నానని పోస్టులో పేర్కొన్నారు.

