బత్తాయి సాగులో నల్లగొండకు దేశస్థాయి గుర్తింపు తీసుకువస్తాం: కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) అన్నారు. శనివారం నల్గొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి (Minister Komatireddy) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. నల్గొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని, జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా, కాలక్రమేనా వివిధ కారణాలవల్ల అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు వరిపైనే ఆధారపడకుండా బత్తాయి లాంటి పంటలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు.

పంట మార్పిడిపై తప్పనిసరి దృష్టి సారించాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగుచేసే రైతులకు సహకారం అందిస్తుందని, ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, రూ.500 బోనస్ ఇచ్చి సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు పంట మార్పిడితోపాటు, ఉద్యాన పంటలను సాగు చేయాలని, నల్గొండ జిల్లాలో బత్తాయి సాగుకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

అవసరమైతే హైదరాబాద్‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ ఎగుమతులు, తదితర విషయాలపై ఆలోచిస్తామన్నారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డి. రాజి రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి, చెవిటి వెంకన్న, పావని రెడ్డి, ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల అధికారులు, అభ్యుదయ రైతులు, బత్తాయి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రాజ్య‌స‌భ‌లో బ‌లం కోస‌మే బీజేపీ కుట్ర‌: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>