కలం, భువనగిరి : ఎర్రవల్లి ఫామ్‌హౌస్ (Erravalli Farmhouse) పరిసరాల్లోని అక్రమ భూములను తేల్చేందుకు ఎంపీలందరం కలిసి నేరుగా కలెక్టర్ ఆఫీస్‌లోనే కూర్చొని విచారణ జరుపుతామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పష్టం చేశారు. గురువారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ దగ్గర 295 ఎకరాల భూమి ఉంటే, వెంకటాపూర్ – ఎర్రవల్లి మధ్య దాదాపు 300 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే వెల్లడించారని ఎంపీ చామల గుర్తు చేశారు.
ఎర్రవల్లి భూములపై ప్రశ్నలు
“మీ ఫామ్‌హౌస్‌లో ఉన్నవి ఓవర్ లాపింగ్ భూములా కాదా? ఆ భూములను పేదలకు మీరు పంచుతారా, లేక మమ్మల్ని పంచమంటారా?” అని చామల (MP Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. ఈ భూములు ఏమైనా కేసీఆర్ కుటుంబానికి వారి తాతలు ఇచ్చిన ఆస్తులా అని ఎద్దేవా చేశారు. జివో 111 పరిధిలోని జన్వాడలో సత్యం రామలింగరాజు భూములు, అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసిన ఆస్తులు కేటీఆర్ పేరు మీదకు ఎలా వచ్చాయో బహిరంగంగా సమాధానం చెప్పాలన్నారు. గత పదేళ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి, ఇష్టారాజ్యంగా కమిషన్లు నొక్కి తెలంగాణను తీవ్రంగా దెబ్బతీశారని, కేటీఆర్‌కు సోడా కలిపే నాయకులకు కూడా కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు.
కేటీఆర్ ఆస్తులపై సమాధానం చెప్పాలన్న డిమాండ్
అమెరికా నుంచి కేటీఆర్ తెలంగాణకు ఎందుకు వచ్చారు? నాయకుడు కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేయడానికి వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో “నేను కేవలం కాపలా కుక్కను మాత్రమే”, “దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తా”, “నా కుటుంబానికి పదవులు అవసరం లేదు” అని చెప్పిన కేసీఆర్.. తర్వాత ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కి కుటుంబ పాలన సాగించారని విమర్శించారు. ఈటల రాజేందర్‌కు ఒక న్యాయం, మీకు మరొక న్యాయమా అని నిలదీశారు. హకీంపేట మండలంలో 130 సర్వే నంబర్‌లోని 85 ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంచిన విషయాన్ని ప్రస్తావించారు.
నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు
మరోవైపు, నిషేధిత జాబితా (ప్రోహిబిటెడ్ లిస్ట్)లో పడిన భూముల సమస్యలను క్లియర్ చేసి తగ్గించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. భూ సమస్యల వల్ల ఏ ఒక్క సామాన్యుడూ బాధపడొద్దని స్పష్టం చేశారన్నారు. డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన యుపిఐపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎంపీ చామల చెప్పారు. కేవలం అమెరికాకు లబ్ధి చేకూర్చేందుకే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని, దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

