కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోని గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Pedda Loni Food Poisoning) మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే సుమారు 15 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన రాయికోడ్ 108 సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలను సందర్శించి, భోజనం నమూనాలను సేకరించే పనిలో పడ్డారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల ఖచ్చితమైన కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

