కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తాము ప్రచారం కంటే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. సోమవారం మక్తల్ (Makthal) నియోజకవర్గంలో హ్యామ్ రోడ్లకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తో కలిసి శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల్లో చేపట్టిన పనులకు సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు మిగిల్చడంతో పాటు రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం రాష్ట్రంపై మోపారని ద్వజమెత్తారు. పదేళ్లపాటు రోడ్లను సరిగా అభివృద్ధి చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. మక్తల్–నారాయణపేట రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి, ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు.
రహదారి విస్తరణకు ప్రజలు సహకరించి అవసరమైన భూమిని ఇవ్వాలని, భూములు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తుందని చెప్పారు. రహదారి నిర్మాణం విషయంలో అవసరమైన పరిపాలన అనుమతులన్నింటినీ త్వరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ను మంత్రి ఆదేశించారు. ‘మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. వ్యాపారాలు పెరిగి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది’ అని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ కాలం నాటి బిల్లుల కోసం ఇప్పటికీ కాంట్రాక్టర్లు తిరుగుతున్నా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అన్నింటికీ కలిపి ఏడాదికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెంకట్ రెడ్డి (Minister Komatireddy) వివరించారు. గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉండగా, తమ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అని చెప్పారు.
అనంతరం మంత్రులు జూపల్లి (Jupally) మాట్లాడుతూ, ఒక్క ప్యాకేజీలో రూ.547 కోట్లు అందులో 4 లైన్ల రోడ్డు నిర్మాణం అంటే ఆషామాషీ కాదు అని చెప్పారు. రోడ్డు వ్యవస్థ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. సాగునీటి పరంగా మక్తల్ మంచి పురోగతి సాధిస్తుందని, వచ్చే ఎన్నికల నాటికి సాగునీటి వనరులు ఇక్కడ గణనీయంగా పెరుగుతాయని జూపల్లి తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే రూ.30 వేల కోట్ల తో ఇందిరమ్మ ఇండ్లను నిర్మింపజేస్తున్నామన్నారు. రోజు రూ.1000 కోట్లు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మిస్తున్నామన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని తెలిపారు. ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని ఈ భారీ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పిందని, కానీ నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్, మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, మార్కెట్ చైర్మన్ లు రాధా లక్మారెడ్డి, సదా శివా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, ఆర్ అండ్ బీ సీఈ వెంకటేశ్వర్ రావు, ఎస్ఈ రాజేందర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: భద్రాచలం వారధి.. గుండెలను పిండేసే కన్నీటి కథకు 62 ఏళ్ళు
Follow Us On: Instagram

