ఎస్టీ రిజర్వేషన్లపై దాసరి మనోహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కలం, పెద్దపల్లి : తెలంగాణలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) అన్నారు. పెద్దపల్లి మండలం గోపయ్యపల్లి (Gopaiahpalli) గ్రామంలోని లంబాడీ తండాలో గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ అమలు చేసిందన్నారు. దీంతో గోండులు, లంబాడీలు, నాయక్‌పోడులు తదితర గిరిజన వర్గాలకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా ప్రోత్సహించడంతో పాటు హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీం ఆదివాసీ భవన్ నిర్మించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడామని పేర్కొన్నారు.

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించామని, గురుకులాల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. గిరిజన విద్యార్థులకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం, ప్రైవేట్ కంపెనీల్లో ఎస్టీలకు ప్రాధాన్యత కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ సదయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ శంకర్ నాయక్, ముత్యాల రాజయ్య, బాపు, చంద్ర మొగిలి, ఉప సర్పంచ్ వేల్పుల హరీష్, మల్ రెడ్డి, రాకేష్, సంతోష్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>