కలం, మెదక్ బ్యూరో: జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తాండా (Islampur Thanda)లో చిరుతపులి కలకలం రేపింది. తాండాకు చెందిన లంబాడి రాజు అనే రైతు తన పొలం వద్ద కట్టేసిన లేగ దూడపై చిరుత దాడి (Leopard Attack) చేసింది. దూడను దారుణంగా గాయపరచి తినేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ ప్రాంత సమీపంలో ఉన్న గ్రామాలు, తాండాల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ రేంజ్ అధికారి అంబర్ సింగ్ సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు వహించాలని, పశువుల పాకల వద్ద తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. చిరుతను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

