Mobile Popup Ad
Mobile Popup Ad

మానకొండూరులో ఆర్ఎంపీ, పీఎంపీలతో కేంద్ర మంత్రి ‘చాయ్ పే చర్చ’

కలం, కరీంనగర్ బ్యూరో: గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు లేని గ్రామీణ సమాజాన్ని ఊహించుకోలేమని చెప్పారు. అలాంటి వారిపై దాడులు చేయడం సరికాదని, ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. గ్రామీణ వైద్యులు సేవలు నిలిపేస్తే ఆరోగ్య వ్యవస్థ స్థంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం ఉదయం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆర్ఎంపీ, పీఎంపీలతో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సమాజంలో అట్టడుగునున్న చిట్ట చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ సిద్దాంతమని, తూచా తప్పకుండా అమలు చేస్తున్న మహనీయుడు మోదీ అని కొనియాడారు.

మోదీ పాలనా విజయాలను వివరించడంతోపాటు ప్రజలకు మరింత మేలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవసరమైన సలహాలు సూచనలు తీసుకునేందుకు ‘చాయ్ పే చర్చ’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు ఫీల్డులో తమకు ఎదురవుతున్న సమస్యలను ఏకరవు పెట్టారు. కొంత మంది కావాలని తమపై అకారణంగా దాడులు చేస్తున్నారని వాపోయారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. మానకొండూరు నియోజకవర్గంలో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ల అసోసియేషన్ సంఘ భవనం లేదని, నూతన భవన నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించాలని విజ్ఝప్తి చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆర్ఎంపీలపై దాడులను ఖండించారు. ఆర్ఎంపీ, పీఎంపీలతో సమాజానికి మంచి జరుగుతోందే తప్ప నష్టం జరగడం లేదు. తక్కువ ఖర్చుతో కుటుంబ సభ్యుల్లా మెలుగుతూ వైద్య సేవ అందిస్తున్నది ఆర్ఎంపీలే. ఆర్ఎంపీలు లేని సమాజాన్ని ప్రజలు ఊహించుకోలేరు. అలాంటి వారిపై దాడులు చేయడం సమర్ధనీయం కాదు. ఆర్ఎంపీలు 10 రోజులు తమ సేవలను నిలిపివేస్తే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోవడం ఖాయం. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నది ఆర్ఎంపీలే’’ అని చెప్పారు.

మోదీ పనితీరు గురించి మాట్లాడుతూ.. “మోదీ విజన్ ఉన్న నేత. 10 ఏళ్ల ముందు ఈ దేశం ఎలా ఉంటుందో ఆలోచించి అందుకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడతారు. డిజిటల్ విప్లవం అందులో భాగమే. 10 ఏళ్ల ముందు జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేసి డిజిటిల్ లావా దేవీలను ప్రారంభిస్తే అందరూ హేళన చేశారు. ఇయాళ ఏమైంది? రోడ్డుపై చాయ్ అమ్ముకునే వ్యాపారులు కూడా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లావా దేవీలు జరుపుతున్నారు. ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదును దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుడి ఖాతాలోనే పడుతోంది” అని చెప్పారు.

తన ఏడేళ్ల ఎంపీ పదవీ కాలంలో రూ.22 వేల కోట్లకు పైగా నిధులొచ్చాయన్నారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలకు పెద్ద ఎత్తున నిధులిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ వస్తే… కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయన్నారు. “మా ప్రాధాన్యత విద్య, వైద్యం. పేద వాడికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తాం. మానకొండూరులో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు సంక్షేమ భవన్ విషయంలో ల్యాండ్ చూపిస్తే సంఘ భవన నిర్మాణానికి తప్పకుండా ఆర్థిక సాయం అందిస్తా” అని చెప్పారు. అందరికీ ఇచ్చారు అధికారం… ఈసారి బీజేపీకి ఇవ్వండి అవకాశం అంటూ అభ్యర్ధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>