కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : విద్యార్థులు కస్టపడి చదివి భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ (Minister Azharuddin) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బోయపల్లి లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, రూ.2.5 కోట్లతో నిర్మించిన బాలికల హాస్టల్‌ను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, ,ప్రభుత్వ రంగ సంస్థల శాఖా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ , ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల సంక్షేమ కు కృత నిశ్చయం తో పని చేస్తుందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని , జీవితంలో స్థిర పడాలంటే చదువు చాలా ముఖ్యం అన్నారు. ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక స్థాయిలో పొందిన విద్య ఉన్నత విద్యకు పునాది అని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు చదువు పై శ్రద్ధ పెట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతున్నారని చెప్పారు. విద్యార్థిని లు బాగా చదవాలని, వారి చదువు ఒక తరం అభివృద్ధికి దోహద పడుతుందని అన్నారు. విద్యార్థులు ఆటలతో పాటు చదువు నిర్లక్ష్యం చేయవద్దని, తమకు నైపుణ్యం ఉన్న రంగం లో కృషి చేసి ఉన్నత స్థానం కు ఎదగాలని సూచించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గురుకుల పాఠశాల విద్యార్థులు ఐ. ఏ ఎస్., ఐ.పి.ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని అన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని,గురుకుల పాఠశాల లో పౌష్టిక ఆహారం అందించాలని ఆదేశించారు.

