కలం, స్పోర్ట్స్ : నేషన్స్ కప్ (Nations Cup) లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. సెమీఫైనల్లో చిలీని ఏకంగా 6-0 తేడాతో చిత్తు చేసిన భారత్, ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఆదివారం ఆతిథ్య న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆక్లాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నవనీత్ కౌర్ 6వ, 13వ నిమిషాల్లో గోల్స్ చేసి జట్టుకు బలమైన ఆరంభం అందించింది. వెంటనే దీపిక 14వ, 18వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ నమోదు చేసి స్కోరును 4-0కు చేర్చింది.
దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి చిలీపై భారత్ పూర్తి పట్టు సాధించింది. విరామం తర్వాత కూడా భారత జట్టు అదే జోరు కొనసాగించింది. 36వ నిమిషంలో నేహా, 39వ నిమిషంలో రుతుజా దాదాసో పిసాల్ గోల్స్ చేయడంతో ఆధిక్యం 6-0కు చేరింది. చిలీ తిరిగి పుంజుకునే అవకాశమే ఇవ్వకుండా భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించారు. పెనాల్టీ కార్నర్లను సమర్థంగా వినియోగించుకున్న భారత్, సాధించిన ఏడు అవకాశాల్లో నాలుగింటిని గోల్స్‌గా మలిచింది.
ఎడమ వైపు నుంచి నిరంతరం దాడులు చేసిన కెప్టెన్ సలీమా టేటే మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. జట్టు కలిసి ఆడి, సులభమైన ఆటతీరును కొనసాగించడమే విజయానికి కారణమని ఆమె పేర్కొంది. ఫైనల్‌లో కూడా మరో విజయమే లక్ష్యమని తెలిపింది. ఇక మరో సెమీఫైనల్లో న్యూజిలాండ్, అమెరికాపై షూటౌట్‌లో 4-1తో గెలిచి ఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకు రెండు జట్లు తమ నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. దీంతో టైటిల్ పోరు ఆసక్తికరంగా మారింది.

