Mobile Popup Ad
Mobile Popup Ad

దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్‌కు పేటెంట్ హక్కు: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు దొర గారి మెప్పు పొందడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అన్నారు. గురువారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడారు.

ఏడాది క్రితం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానని మంత్రి అడ్లూరి అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పని చేశారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల కార్యదర్శిగా పని చేశారని, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో రూ. 2వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపిస్తే ఆశాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి అన్నారు.

సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్ధులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ. 683 కోట్లతో టెండ్లర్లు పిలిచామని, రూ. 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ఖారారు చేశామని మంత్రి అడ్లూరి తెలిపారు. మొత్తం రూ. 1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే మాజీ మంత్రి హరీష్ రావు రూ. 2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తే ఆశాఖ మంత్రిగా జవాబు చెప్పానని అన్నారు. తాను జవాబు చెప్పితే దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఖబడ్దార్ అని మాట్లాడుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్‌కు అవమానం జరిగితే తాను సాటి దళితుడిగా ఆరోజు ప్రతిపక్షంలో ఉండి అండగా నిలిచానని మంత్రి గుర్తుచేశారు. 2018 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ఎలా గెలిచాడో తెలంగాణ ప్రజలందరికి తెలుసని అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూం తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలేదన్నారు.

కొప్పులపై తాను 2009లో పోటీ చేస్తే కేవలం 1165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని, తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవ్వరికి డిపాజిట్ రాలేదని తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని మంత్రి అడ్లూరి గుర్తు చేశారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని ఆరోపించారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో ఏమీ తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ఈశ్వర్ కు ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పులకు ఓట్లే వేయలేదని ఎద్దేవా చేశారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల, గురుకుల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ కలిసి దోచుకున్నారు కనుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వడ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారని, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సీజన్లలో వడ్లు కొనుగోలు చేసిందని, మరి అప్పుడు జీవన్ రెడ్డికి ఎంత కమీషన్ వచ్చిందో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>