కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం (Central Govt) బాధ్యత మరిచిందని, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లో ధాన్యం కేంద్రాన్ని మంత్రి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు జరుగుతున్న తీరును, రైతులకు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు విషయాన్ని పట్టించుకోవడంలేదని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో మూడు పంటల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరణ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని, కేంద్రం తీరుతోనే ధాన్యం నిల్వలు పేరుకు పోయాయని మండిపడ్డారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ పరిస్థితులను కేంద్రానికి వివరించాల్సి పోయి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రదాని మోదీ బహిరంగ సభలో సైతం రైతుల సంక్షేమం గురించి ప్రస్తావన తీసుకురాలేదని గుర్తుచేశారు. బాధ్యత లేని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు ఆందోళన పడొద్దని, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. అధికారులు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులను ఇబ్బందులు పెడితే రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
రోడ్డు పనులు పరిశీలిన
ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుండి పెగడపల్లి మండలం కీచులాటపల్లి వరకు నిర్మిస్తున్న నూతన రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. రూ. 11.21 కోట్లతో నిర్మిస్తున్న నూతన రోడ్డుతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు. భూముల ధరలు సైతం పెరుగుతాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

