epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

పర్యావరణ సవాళ్లపై పోరాటానికి అరకొరే

కలం, వెబ్​డెస్క్​: కొన్నేళ్లుగా దేశంలో తుపానులు, వరదలు, తీవ్రమైన ఎండలు పెరిగిపోతున్నాయి (Union Budget 2026). కాలుష్యం సంగతి చెప్పక్కర్లేదు. పొల్యూషన్​తో దేశ రాజధాని ఢిల్లీ పడుతున్న అవస్థలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. దీనిపై న్యాయస్థానాలు సైతం అసహనం వ్యక్తం చేశాయి. తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ క్రమంలో వీటన్నిటికి కారణమవుతున్న వాతావరణ, పర్యావరణ సవాళ్లపై పోరాటానికి అనుగుణంగా బడ్జెట్​లో భారీ కేటాయింపులు ఉంటాయని ప్రజలు, పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు భావించారు. అయితే, ఆదివారం పార్లమెంట్​లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)​ ప్రవేశపెట్టిన బడ్జెట్​లో కేవలం కొంతమేర మాత్రమే కేటాయింపులు పెరిగాయి.

కేంద్ర బడ్జెట్​ 2026–27 (Union Budget 2026)లో వాతావరణం, అరణ్యాలు, పర్యావరణ శాఖకు రూ.3,759.46 కోట్లు కేటాయించారు. ఇది, 2025–26 బడ్జెట్​లోని​ రూ.3,481.61 కోట్లతో పోలిస్తే ​రూ.278 కోట్లు ఎక్కువ. అంటే, పెరుగుదల 8 శాతం. వాస్తవానికి బడ్జెట్​లో నిధులు పెరిగినట్లు కనిపించినా.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వాతావరణ, పర్యావరణ సవాళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువని నిపుణులు అంటున్నారు.

ఈ ఏడాది కేటాయింపులను వివరంగా పరిశీలిస్తే.. మూలధనం వ్యయం (క్యాపెక్స్) రూ.174.39 కోట్ల నుంచి రూ.222.80 కోట్లకు పెరిగింది. ఇది పరిశోధన, మౌలిక వసతులు, పర్యవేక్షణ కేంద్రాల వంటి దీర్ఘకాలిక ఆస్తులపై కొంత అదనపు పెట్టుబడిని సూచిస్తోంది. అలాగే, రెవెన్యూ వ్యయం స్వల్పంగా పెరిగింది. ఇది ప్రధానంగా ఇప్పటికే ఉన్న సంస్థలు, పథకాలకు మద్దతు కొనసాగింపునకు ఉపయోగపడనుంది.

బడ్జెట్‌లో నియంత్రణ, సంస్థాగత సామర్థ్యం పెంపునకు ఎక్కువ కేటాయించారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వంటి అనుబంధ, ఉప సంస్థలకు కేటాయింపులు పెరిగాయి. పర్యావరణ పర్యవేక్షణ, వివాదాల పరిష్కారంపై పెరుగుతున్న పనిభారం దీనికి కారణంగా చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా పర్యావరణ సంబంధ కేసులు పెరుగుతున్నందున ఎన్‌జీటీకి నిధుల్లో ఎక్కువ భాగం పంచారు. కాలుష్య నియంత్రణకు రూ.1,091 కోట్లు ఇచ్చారు. అయితే, ఇది 2025–26 సవరించిన అంచనాల్లో ఇచ్చిన రూ.1,300 కోట్ల కంటే తక్కువ. అనేక నగరాల్లో గాలి నాణ్యత ప్రజారోగ్య సంక్షోభంగా మారుతున్న వేళ ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అంటున్నారు.

అడవులు, వన్యప్రాణి సంరక్షణ..

అడవుల సంరక్షణ పరంగా గ్రీన్ ఇండియా జాతీయ పథకానికి​ రూ.212.50 కోట్లు కేటాయించారు. ఇది గత అంచనాల కంటే తక్కువే. ఇక, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్​ కార్యక్రమాలకు కేటాయింపులు మారలేదు. రూ.290 కోట్ల వద్దనే కొనసాగాయి.

Read Also: బడ్జెట్ ఎఫెక్ట్​ : ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>