కలం, వెబ్ డెస్క్ : పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో నమోదైన కేసులను చట్ట ప్రకారం మూసివేయడానికి లేదా ఉపసంహరణకు అవసరమైన ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. గతంలో హత్య, లైంగికదాడి వంటి తీవ్రమైన నేరాల కేసులు ఉన్నవారికి ఈ వెసలుబాటు వర్తించదని తెలిపింది. జూలై 28న ఇచ్చిన ఉత్తర్వులపై తలెత్తిన సందిగ్ధతను నివృత్తి చేస్తూ ఈ వివరణ ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
ఆ పదంపై క్లారిటీ
–జూలై 28న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న ‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ అనే పదానికి కూడా స్పష్టత ఇచ్చింది. హత్య, లైంగికదాడి వంటి తీవ్రమైన నేరాలున్న వారికి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
–విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుపై కొంత సందిగ్ధత ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
–చట్టపరంగా ఎఫ్ఐఆర్ను నేరుగా ఉపసంహరించుకునే అవకాశం లేదని, క్లోజర్ రిపోర్టు దాఖలు చేయడం, ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు దరఖాస్తు చేయడం లేదా కోర్టు ద్వారా కేసులను కొట్టివేయించడం వంటి మార్గాలు ఉన్నాయని వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వ తరఫున పూర్తి వివరాలను త్వరలో సమర్పిస్తామని తెలిపారు.
తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా
అధిక బలప్రయోగానికి పాల్పడిన పోలీసు అధికారులను కూడా కాపాడబోమని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిరసనల్లో పెలెట్ గన్స్ వినియోగంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, పౌరులపై అలాంటి ఆయుధాల వినియోగానికి సంబంధించి స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో జూలై 20న జరిగిన ‘చలో పార్లమెంట్’ విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల అధిక బలప్రయోగం, పెలెట్ గన్స్ వినియోగం, లాఠీచార్జ్, మైనర్ల అరెస్టులు, మహిళా నిరసనకారులపై దాడులు తదితర ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఆగస్టు 18కు వాయిదా వేసింది.
Also Read : సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Follow Us On: Sharechat

