కలం, నల్లగొండ బ్యూరో : మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU)లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల నిర్వహణలో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టి ఉపకులపతి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti) యూనివర్సిటీ స్థాయిలో ఘనంగా నిర్వహించాల్సి ఉండగా, మొక్కుబడిగా మాత్రమే నిర్వహించారనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై దళిత, బహుజన విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా గతంలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతుల సందర్భంలో కూడా ఇదే విధంగా నిర్లక్ష్యం చూపారంటూ ఆరోపించాయి.
విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముందుగానే వినతిపత్రాలు అందజేసినప్పటికీ యూనివర్సిటీ(MGU) వైస్ ఛాన్సలర్ స్పందించలేదని మండిపడ్డారు. ఈ వైఖరి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయుల జయంతులను విస్మరించడం సామాజిక న్యాయాన్ని అవమానించడమేనని వారు పేర్కొన్నారు. యూనివర్సిటీ అధికారులపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్ స్వేరో, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు మాచర్ల సుధీర్ మాదిగ, పీడీఎస్‌యూ అధ్యక్షుడు హర్ష తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Also: జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం: రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

