కలం, కరీంనగర్ బ్యూరో: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం (MLA Medipally Satyam) పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సహా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే (MLA Satyam) పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి సాధ్యం కాని ఎస్సీ వర్గీకరణను ఈ ప్రభుత్వం చేసిందన్నారు. కేబినెట్‌లో నలుగురు దళిత మంత్రులు ఉన్నారని, స్పీకర్, డిప్యూటీ సీఎంగా దళితులే ఉన్నారని, కరీంనగర్ జిల్లాలో ముగ్గురం దళిత ఎమ్మెల్యేలం ఉన్నామని, మమ్మల్ని సంప్రదిస్తే అండగా ఉంటామని పేర్కొన్నారు.
కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. వ్యక్తిగత ఎదుగుదల కంటే సామాజిక ప్రయోజనాలే గొప్పవని చాటిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజలు, సంఘాల నాయకులు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ అంబేద్కర్ చెప్పిన మాటలు ‘Educate, Agitate, Organize’ నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే మనం ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. తాను ప్రభుత్వ విద్యాసంస్థల్లో, స్కాలర్‌షిప్‌తో చదివి ఈ స్థాయికి చేరినట్లు సీపీ గుర్తు చేసుకున్నారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆనవాయితీ ప్రకారం భీమ్ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం: రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

