కలం, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) విద్యార్థుల్లో ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా మరో కీలక అడుగు పడింది. వర్సిటీకి చెందిన ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మా, కెమిస్ట్రీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు గాను లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (Skill Development Council) సంస్థతో గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు మార్కెట్ ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు.
మైక్రోబయాలజిస్ట్, క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటర్, స్టెరైల్ ఫార్ములేషన్స్ విభాగాల్లో ప్రత్యేక కోర్సులు, ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పరిశోధనలపై పూర్తి అవగాహన పెరిగి, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల వివరించారు.
ఈ ఎంఓయూ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల, డాక్టర్ మిర్యాల రమేష్, అశ్విని, లైఫ్ సైన్సెస్ సంస్థ ప్రతినిధి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

