పొట్టదశలో వరిపంటలు.. సాగుకు విద్యుత్ కోతలు: గాదరి కిశోర్

కలం, తుంగతుర్తి: వ్యవసాయానికి అనాలోచితంగా విద్యుత్ కోతలు విధిస్తూ పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ నేతలు కారణమవుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి కేంద్రంలో గురువారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ (Gadari Kishore) ఆధ్వర్యంలో రైతులు, పార్టీ కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ సాగునీటి, విద్యుత్ విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం వరి పంటలు కీలకమైన పొట్ట దశలో ఉన్నాయని, ఈ సమయంలో నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తేనే పంట చేతికి వస్తుందని పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పొలాలు ఎండుతూ నెర్రెలు వారుతున్నాయని గాదరి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి ప్రాంతానికి సమృద్ధిగా సాగునీరు అందేదని, ప్రస్తుత ప్రభుత్వం నీరందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే అక్కడ ఉత్పత్తిని పెంచడం లేదని గాదరి కిషోర్ విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలు ఎండిపోకుండా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 50వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించిన గాదరి… దీనిపై బీఆర్ఎస్ నేతలపై చేస్తున్న విమర్శలకు తాము ప్రజాక్షేత్రంలోనే తగిన సమాధానం చెబుతామన్నారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరసన ఎదురవుతుందని గాదరిహెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>