కలం డెస్క్ : నగరానికి ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకున్నా లీగల్ చిక్కులు వెంటాడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్‌లను జీహెచ్ఎంసీలో విలీనం చేసేలా మున్సిపల్ చట్టానికి సవరణలు చేసే ఆర్డినెన్సును ప్రభుత్వం విడుదల చేసింది. అదే సమయంలో జీహెచ్ఎంసీ చట్టానికి కూడా సవరణలు చేసేలా మరో ఆర్డినెన్సును విడుదల చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్సులకు గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. కానీ ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల పాలకమండళ్లు లేదా స్పెషల్ ఆఫీసర్ల నుంచి తీర్మానాలు లేని కారణంగా రాజ్‌భవన్ కొర్రీలు వేసింది. ప్రభుత్వం ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ప్రయత్నాలు ప్రారంభించింది.
జీహెచ్ఎంసీ(GHMC)లో ప్రభుత్వం విలీనం చేయాలనుకున్న 20 మున్సిపాలిటీల పాలకమండళ్ల తీర్మానాలు లేని కారణంగానే ఆమోదం తెలపకుండా రాజ్‌భవన్ పెండింగ్‌లో పెట్టింది. మొత్తం 20 మున్సిపాలిటీల పాలకమండళ్ళ పదవీకాలం ముగిసిపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. క్యాబినెట్‌లో విలీనం నిర్ణయం తీసుకునే సమయానికి పాలకమండళ్ళ నుంచి తీర్మానాలను ప్రభుత్వం తీసుకుని దానికి అనుగుణంగా ఆర్డినెన్సులు జారీచేసింది. కానీ అప్పటికి స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రావడంతో తాజా తీర్మానాలు అవసరమంటూ రాజ్‌భవన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. స్పెషల్ ఆఫీసర్ల తీర్మానాలు లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాజ్‌భవన్ ఆలోచనలో పడింది. అందుకే గవర్నర్ తన దగ్గరకు వచ్చిన రెండు ఆర్డినెన్సు బిల్లులను నిలిపి వేసినట్లు సమాచారం. మునిసిపల్ కౌన్సిళ్ల గడువు ముగియక ముందే వాటి నుంచి తీర్మానం కాపీలు తెప్పించామంటూ సచివాలయ అధికారులు సమర్ధించుకుంటున్నా సాంకేతికంగా ఆ తీర్మానాలు చెల్లవని అటు రాజ్‌భవన్ వర్గాలు, ఇటు మున్సిపల్ శాఖ నిపుణులూ అభిప్రాయపడుతున్నరు. వెంటనే స్పెషల్ ఆఫీసర్ల నుంచి తీర్మానాలు తెప్పించాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి రాజ్‌భవన్ వర్గాలు.
రాజ్‌భవన్ నుంచి కొర్రీలు రావడంతో మున్సిపల్ అధికారులు ఆలోచనలో పడ్డారు. క్యాబినెట్ మీటింగ్‌కు ముందే ప్రత్యేక పాలనాధికారుల నుంచి తీర్మానం కాపీలు తెప్పించుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ రెండు ఆర్డినెన్సులను తగిన వివరణలను సూచిస్తూ రాజ్‌భవన్ తిప్పి పంపిన తరవాత, స్పెషల్ ఆఫీసర్ల తీర్మానాలను జోడించి బిల్లులను మళ్లీ పంపాలని సర్కారు భావిస్తున్నది. మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో ఆ ఆర్డినెన్సుకు లీగల్ చిక్కులు తొలగిపోయినట్లయింది. కానీ 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పాలకమండళ్ళ తీర్మానాలు లేనందున స్పెషల్ ఆఫీసర్ల నుంచి తీర్మానాలు సేకరించి ఆర్డినెన్సుతో కలిపి రాజ్‌భవన్‌కు పంపిన తర్వాత గవర్నర్ పరిశీలించి, లీగల్ అంశాలను నిపుణులతో చర్చించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
Read Also: వాయిదాలు కట్టకుంటే ఎన్‌పీఏ ప్రకటిస్తాం : ఆర్ఈసీ
Follow Us On: X(Twitter)


