కలం, స్పోర్ట్స్: 2026 ఫార్ములా వన్ సీజన్‌లో మెర్సిడెజ్ జట్టు మునుపటి వైభవాన్ని చాటుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా 19 ఏళ్ల యువ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి (Kimi Antonelli) వరుస విజయాలతో చరిత్ర సృష్టించి, ప్రస్తుతం వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో 72 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మెర్సిడెజ్ ప్రయాణం 1950లోనే మొదలైంది. అప్పట్లో జువాన్ మాన్యుయెల్ ఫాంగియో నేతృత్వంలో వరుస టైటిళ్లు గెలిచినా, 1955 లే మాన్స్ ప్రమాదం తర్వాత ఆ సంస్థ రేసుల నుంచి తప్పుకుంది. మళ్ళీ 2010లో రీ-ఎంట్రీ ఇచ్చి, మైఖేల్ షూమాకర్, నికో రోస్‌బర్గ్‌లతో జట్టును పటిష్టం చేసుకుంది. ఆ తర్వాత 2014 నుండి 2021 వరకు లూయిస్ హామిల్టన్ హవా నడిచింది. ఈ ఎనిమిదేళ్లలో హామిల్టన్ ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలిచి మెర్సిడెజ్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టారు.
అయితే, 2021లో మాక్స్ వెర్‌స్టాపెన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో హామిల్టన్ ఓడిపోవడం మెర్సిడెజ్ పతనానికి దారితీసింది. 2022లో కార్ల డిజైన్ నియమాల్లో వచ్చిన మార్పుల వల్ల ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. ముఖ్యంగా వారు ప్రవేశపెట్టిన ‘జీరో సైడ్‌పాడ్’ డిజైన్ విఫలమైంది. మూడేళ్ల పాటు వరుస పరాజయాల తర్వాత, 2025లో లూయిస్ హామిల్టన్ ఫెరారీ జట్టులోకి వెళ్లడంతో ఒక శకం ముగిసింది.
ప్రస్తుతం 2026 సీజన్‌లో కొత్త నిబంధనలకు అనుగుణంగా మెర్సిడెజ్ సరికొత్త ఏరోడైనమిక్ విధానాన్ని ఎంచుకుంది. హామిల్టన్ స్థానంలో వచ్చిన కిమీ ఆంటోనెల్లి (Kimi Antonelli) చైనా, జపాన్ రేసుల్లో వరుసగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. జపాన్ రేసు గెలవడంతో ఎఫ్ వన్ చరిత్రలోనే అతి చిన్న వయసులో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన డ్రైవర్‌గా కిమీ రికార్డు సృష్టించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మెర్సిడెజ్ వరుసగా మూడుసార్లు పోడియం ఫినిష్ సాధించి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటోంది. మెర్సిడెజ్ జట్టు ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ సరికొత్త వ్యూహాలతో రేసింగ్ ట్రాక్‌పై మళ్ళీ తన పట్టును నిరూపించుకుంటోంది. రాబోయే రేసుల్లో ఈ జోరు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Read Also: నిలబడిన హెడ్.. కేకేఆర్ టార్గెట్ 166!
Follow Us On: Instagram

