కలం, సినిమా : హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన ఇంట్లో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుత దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. మనకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే సూర్య భగవానుడి కిరణాలు (Sun Rays).. తమ ఇలవేల్పు హనుమంతుడి విగ్రహాన్ని(Hanuman Idol) స్పృశించే అరుదైన సంఘటనను వివరించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్య కిరణాలు సప్తవర్ణాలుగా మారి తన ఇంట్లో హనుమంతుడి విగ్రహాన్ని పాదాల నుంచి శిరస్సు వరకు తాకుతూ సాగుతాయని తెలిపారు. ఈ దృశ్యం తనకు ఎంతో దైవానుభూతిని కలిగిస్తుందని చెప్పారు.
ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించిన ‘సూర్య తిలకం’ ఘటనను గుర్తు చేస్తూ, తన ఇంట్లో కూడా అలాంటి పవిత్ర అనుభూతి కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. అలాగే అరవసవిల్లి , కోణార్క్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఈ అద్భుతం తన ఇంట్లోనూ జరగడం విశేషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు, భక్తులందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తి, విశ్వాసం మన జీవితాలకు మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు.
Read Also: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. శ్రీరాముడి అవతార్‌లో రణబీర్
Follow Us On: Pinterest

