కలం, వెబ్ డెస్క్: ఈ ఏడాది రాబోతున్న ఎల్ నినో (El Nino) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం కనిపిస్తుందని.. కొన్ని దేశాల్లో అయితే, పరిస్థితి మరీ భయంకరంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దీనికి 1877లో జరిగిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఎల్ నినో కారణంగా.. వర్షాలు లేక పంటలు పండక.. లక్షలాది ఆకలి చావులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. దీన్ని ‘మెగా డేంజర్ ఎల్ నినో’ అని అభివర్ణిస్తుంటారు. 2026లోనూ ఇదే నమోదు కానుందా.. అనే సంకేతాలు ప్రపంచ దేశాలను ఆందోళన చెందేలా చేస్తున్నాయి. అసలే యుద్ధాల కారణంగా అంతంత మాత్రంగా ఉన్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఎల్ నినో ప్రభావాన్ని ఎలా తట్టుకుంటాయనేది పెద్ద ప్రశ్నగా మారింది.
వేసవి ఎక్కువ కాలం.. వర్షాలు తగ్గుముఖం..
పసిఫిక్ మహా సముద్రంలో నీరు సాధారణం కంటే అధికంగా వేడెక్కినప్పుడు, దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రత, వర్షపాతాలపై ప్రభావం చూపుతుంది. దీన్నే ఎల్ నినో ప్రభావం అంటారు. ఇది కనీసం మూడు నుంచి అయిదు సంవత్సరాలకోసారి సంభవిస్తుంటుంది. ఎల్ నినో కారణంగా, మన దేశంలో వేసవి కాలం జూన్ నెలాఖరు వరకు కొనసాగడంతో పాటు వర్షాలు సాధారణం కంటే తక్కువ కురుస్తాయని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. వర్షాలు మరీ ఆలస్యంగా సెప్టెంబరు వరకు కూడా పడుతాయని.. చాలా ప్రాంతాలు లోటు వర్షపాతంలోనే ఉండిపోతాయని పేర్కొంటున్నారు. మొత్తానికి చూస్తే.. వ్యవసాయ రంగానికి కొంత గడ్డుకాలమే అని విశ్లేషిస్తున్నారు.

