Mobile Popup Ad
Mobile Popup Ad

మీనాక్షి కోసం త్యాగం చేసే ఆ ‘ఒక్కరు’ ఎవరు?

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడం పార్టీలో చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఆమెపై కేసు నమోదైనట్లు రాజకీయ ప్రత్యర్థికి లీక్ చేసిందెవరో దాదాపు కొలిక్కి వచ్చింది. సదరు కోవర్ట్ పై యాక్షన్ సంగతి ఎలా ఉన్నా మీనాక్షికి అవమానం జరిగిన గడ్డ మీద నుంచే తిరిగి రాజ్యసభకు పంపాలనే ప్రతిపాదనను ఒక సీనియర్ నేత పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణ నుంచే ఆమెను రాజ్యసభకు పంపడం సముచితంగా ఉంటుందనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి అది కార్యరూపం దాల్చడానికి.. రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలు ఖాళీ లేకపోవడంతో మీనాక్షి కోసం పదవిని వదులుకోడానికి ఎవరు సిద్ధమవుతారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం పిలుపు ఇవ్వడానికి ముందే స్వచ్ఛందంగా రిజైన్ చేయడానికి ముందుకొచ్చే ఎంపీ ఎవరనేది కూడా కీలకంగా మారింది. పదవి కన్నా పార్టీయే ముఖ్యం అనే సిన్సియారిటీని ప్రదర్శించే ఆ రాజ్యసభ మెంబర్ ఎవరన్నది తేలే సమయం ఆసన్నమైంది.

లీక్స్ పై ఏఐసీసీ, పీసీసీ సీరియస్

మహిళా ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల గురించి బీజేపీ పెద్దపెద్ద మాటలు చెప్తున్నప్పటికీ.. కాంగ్రెస్ సీనియర్ నేతగా మీనాక్షి నటరాజన్ విషయంలో ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆమె రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిందనేది రాజకీయ వివాదంగా మారింది. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకుడే ఈ సమాచారాన్ని ఇచ్చారంటూ మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఎవరా కోవర్టు అనే అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ ఆరా తీస్తూనే దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టింది.

కారణాలు ఏవైనప్పటికీ రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలైన, నిబద్ధత గల నాయకురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్‌ను పార్లమెంట్‌కు పంపించడం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక ప్రతిష్టాత్మక సవాల్‌గా మారింది. తెలంగాణలోని కేసు కారణంగానే ఆమె నామినేషన్ రిజెక్టు కావడంతో అదే తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించాలన్న ఆలోచనలు ఊపందుకున్నాయి. రెండేండ్ల దాకా రాష్ట్రంలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యే అవకాశంలేనందున ఇప్పటికిప్పుడు మీనాక్షిని ఎంపీ చేయడానికి ఉన్న మార్గాలపై పార్టీలో కసరత్తు జరుగుతున్నది.

ముందుకొచ్చేదెవరు?

మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆమెను తెలంగాణ కోటా నుంచే రాజ్యసభకు పంపడం సముచితమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాజ్యసభకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురిలో ఒకరు రిజైన్ చేయడమొక్కటే మార్గం. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలో ఆమె విజయం ఖాయమవుతుంది.

అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యలుగా ఉన్నారు. ఈ నలుగురు సిట్టింగ్ సభ్యుల్లో ఒకరు పదవిని త్యాగం చేస్తేనే మీనాక్షికి లైన్ క్లియర్ అవుతుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జికి తగిన గౌరవం కల్పించేందుకు, పార్టీ పట్ల తమకున్న నిబద్ధతను చాటుకునేందుకు ఏ సిట్టింగ్ ఎంపీ ముందుకొస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

పదవికన్నా పార్టీయే ప్రధానం అనే కమిట్‌మెంట్‌ను ప్రదర్శించుకునేదెవరనేది అసలైన చర్చ. రాజకీయాల్లో పదవులను వదులుకోవడానికి ఇష్టపడని పరిస్థితుల్లో అధిష్టానం దగ్గర ఇమేజ్ సంపాదించుకోడానికి ఇదో మంచి అవకాశమన్నది కూడా మరో కోణం. పార్టీలో తిరుగులేని ‘కమిట్‌మెంట్’ను నిరూపించుకునేది ఆ నలుగురిలో ఎవరనేది పార్టీలో ఇంట్రెస్టింగ్గా మారింది.

సీఎం పిలుపిచ్చే లోపే సాహసోపేత నిర్ణయం?

బీజేపీ కుట్రకు దీటైన జవాబు చెప్పేలా వీలైనంత తొందరగా మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరుగుతున్నది. ఎంపీలు స్వచ్ఛందంగా ముందుకొస్తారా?.. లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్వయంగా పిలుపునిచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి కన్వీన్స్ చేస్తారా?.. ఆ పరిస్థితి తలెత్తకుండా క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా ‘రాజీనామా’ అనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా?.. ఇలాంటివి ఇప్పుడు కీలకంగా మారాయి.

మీనాక్షి నటరాజన్ లాంటి జాతీయ స్థాయి నాయకురాలికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తే, అది రాష్ట్ర పార్టీకి జాతీయ స్థాయిలో మైలేజ్ ఇస్తుందన్నది కాంగ్రెస్ హైకమాండ్ భావన. త్యాగానికి సిద్ధపడే లీడర్‌కు సైతం భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ మైలేజ్ లభిస్తుందనేది కూడా ఒక అంశం. అధిష్టానం దృష్టిలో మార్కులు కొట్టేయడానికి ఇదో సువర్ణావకాశంగా మారుతుంది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుల దాకా ‘త్యాగం’ అంశం వెళ్లకపోయినా ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో మీనాక్షిని రాజ్యసభకు పంపే కసరత్తు ముమ్మరంగానే జరుగుతున్నది.

గతంలో ఇందిరాగాంధీకి మెదక్ చాన్స్..

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సిన్సియారిటీని ప్రదర్శించడం, కమిట్‌మెంట్‌తో పనిచేయడం, పదవుల కోసం కాకుండా ప్రజల్లో పార్టీని సజీవంగా ఉంచడం.. ఇలాంటివే కీలకంగా ఉంటాయి. అలాంటి నేతలకు ఎప్పుడూ పార్టీ హైకమాండ్ దృష్టిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 1980లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అప్పటికే రెండుసార్లు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన మల్లికార్జున్ గౌడ్ తిరిగి పోటీ చేయాలనుకున్నారు.

కానీ, ఇందిరాగాంధీ (Indira Gandhi) పోటీ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకోవడంతోనే టికెట్‌ను ఆశించబోనంటూ ఆయన వెనక్కి తగ్గారు. నాడు ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తనకు అవకాశం ఇచ్చిన మెదక్ ప్రజలతోపాటు పార్టీ స్థానిక నేతలను ఆమె చివరి వరకు గుర్తుంచుకున్నారు. మల్లికార్జున్ గౌడ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసి నాలుగుసార్లు గెలవడమే కాదు.. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ బాధ్యతలూ చేపట్టారు. నాటి కమిట్‌మెంట్, త్యాగం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) విషయంలోనూ ఇప్పటి లీడర్లు చూపిస్తారా? స్వచ్ఛందంగా రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి.. ఆమెకు అవకాశం ఇస్తారా? అనేది పార్టీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: ‘అఖండ కాంగ్రెస్’ అవతరించబోతుందా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>