కలం, మునుగోడు: చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు మెడిటేషన్(Meditation)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుమోహన్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించేందుకు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, ధ్యానం అలవాటు చేసుకోవడం ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, చదువుపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవడానికి ధ్యానం దోహదపడుతుందని వివరించారు. విద్యార్థులకు ధ్యానం చేసే విధానాన్ని తెలియజేస్తూ, ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనస్సును నియంత్రించుకోవచ్చని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ఇలాంటి మంచి అలవాట్లను అలవర్చుకుంటే భవిష్యత్తులో విద్య, వ్యక్తిత్వ వికాసంలో మరింత రాణిస్తారని ఆయన సూచించారు.

