కలం, మెదక్ బ్యూరో : ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో (Medak Municipalities) చైర్మన్ పీఠాల కోసం కొనసాగుతున్న ఉత్కంఠ, భారత్-పాకిస్తాన్ టీ 20 మ్యాచ్‌ను తలపిస్తోంది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జహీరాబాద్, కోహిర్, ఇస్నాపూర్, జిన్నారం, మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
మరోవైపు నర్సాపూర్, జిన్నారం, మెదక్ మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్‌గా మారిన బీజేపీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైస్ చైర్మన్ పదవి ఇస్తామన్న బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆఫర్లను కాదని, తమకు చైర్మన్ సీటే కావాలని కమలనాథులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చినా, మ్యాజిక్ ఫిగర్‌కు రెండు సీట్ల దూరంలో నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 6, బిఆర్ఎస్‌కు 5, బీజేపీకి 4 వార్డులు దక్కాయి. దీంతో ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో అర్థం కాని సంక్లిష్ట పరిస్థితి నెలకొంది.
జిన్నారంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా.. బిఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ బీజేపీ కౌన్సిలర్లు ఎవరికి మద్దతు ఇస్తే వారే చైర్మన్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ మున్సిపాలిటీలో చైర్మన్ ఎంపిక మూడు పార్టీలకు కత్తిమీద సాములా మారింది. ఇక్కడ స్వతంత్ర కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి.
జహీరాబాద్, కోహిర్, మెదక్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో తెలియని స్థితిలో కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రేపు జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కొత్త రాజకీయ పొత్తులు కుదిరే అవకాశం ఉంది.
Read Also: వీటికి బదులివ్వండి.. ట్రేడ్ డీల్‌పై ప్రధానికి రాహుల్ ప్రశ్నలు
Follow Us On: Instagram


