Mobile Popup Ad
Mobile Popup Ad

మెదక్ జిల్లాలో ఈ-కేవైసీ.. లక్షల్లో పెండింగ్‌!

కలం, మెదక్ బ్యూరో: రేషన్, గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోలేదా? నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు నిలిచిపోయే చాన్స్ ఉంది. మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంకా లక్షలాది మంది ఈ-కేవైసీ (Medak e-KYC) ప్రక్రియను పూర్తి చేయకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికైనా ఈ-కేవైసీ పూర్తి చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలో 21 మండలాల్లో 520 రేషన్ షాపులు ఉండగా వీటి పరిధిలో 2,39,217 రేషన్ కార్డులకు గాను మొత్తం 7,81,429 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 5,88,188 మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 1,93,241 మంది ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో ఎల్‌పీజీ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు సుమారు 2,35,412 ఉంటే, 52,047 మంది వినియోగదారుల ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 5,618 మంది వినియోగదారుల ఈ-కేవైసీలు కూడా ఇంకా పూర్తికాలేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఫర్ ఎల్‌పీజీ (డీబీటీఎస్), ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాల పరిధిలోని అన్ని ఎల్‌పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ (బీబీఏ) ద్వారా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అవగాహన లేమితోనే..

ప్రభుత్వ రూల్స్ మేరకు రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు, గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు ఆధార్ అనుసంధానంతో ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమి కారణంగా ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అదే సమయంలో ఈ-కేవైసీ కోసం రేషన్ షాపులు, గ్యాస్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్న ప్రజలకు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం, ఆధార్ వివరాల్లో తప్పులు ఉండటం, మొబైల్ నంబర్ అనుసంధానం లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే తరచూ సర్వర్ సమస్యలు తలెత్తడంతో ప్రజలు పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.

నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు..

భవిష్యత్తులో రేషన్, గ్యాస్ సబ్సిడీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే లబ్ధిదారులు వెంటనే తమ పరిధిలోని రేషన్ డీలర్ లేదా గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈనెల 30వ తేదీలోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీని నిర్లక్ష్యం చేస్తే సబ్సిడీలు నిలిచిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారిని అనర్హులు లేదా నకిలీ లబ్ధిదారులుగా పరిగణించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. రేషన్ కార్డులో ఎవరి ఈ-కేవైసీ పూర్తికాకపోతే వారి ఉచిత లేదా సబ్సిడీ రేషన్ కోటాను నిలిపివేయబడుతుందని పేర్కొంటున్నారు. అలాగే వంటగ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే బ్యాంకు ఖాతాల్లో జమయ్యే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోవచ్చు. దీర్ఘకాలంగా ఈ-కేవైసీ చేయని కార్డులను గుర్తించి తొలగించడం లేదా రద్దు చేసే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్యాస్ వినియోగదారులు గడువులోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుని ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను నిరంతరంగా పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>