కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డిలో కాంగ్రెస్ రెండు ముక్కలైంది. పార్టీలో గురు శిష్యుల పోరు రచ్చ కెక్కింది. షబ్బీర్ అలీ వర్సెస్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం ముదిరిపోయింది. ఇది కాస్త గాంధీ భవన్ నుంచి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇద్దరి నేతల మధ్య పోరులో చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ఎంట్రీతో మరింత హీట్ పెరిగింది. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడంతో రాష్ట్రస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సీటును వదులుకుని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి షబ్బీర్ అలీ ఓటమి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం షబ్బీర్ అలీ త్యాగం చేశారనే భావన ఆయన అనుచరుల్లో ఉంది. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత షబ్బీర్ అలీ త్యాగానికి గుర్తుగా ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. మరోవైపు భవిష్యత్తులో కామారెడ్డిలో తనకే ప్రాధాన్యత దక్కుతుందనే అంచనాలతో షబ్బీర్ అలీ ఉండగా.. పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి ప్రాధాన్యం పెరగడంతో అసంతృప్తి నెలకొంది. దీంతో ఇద్దరి మధ్య అంతర్గతంగా మొదలైన విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.
ఇరువర్గాల మధ్య ఆధిప్యత పోరు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దక్కింది. వాస్తవానికి చంద్రశేఖర్ రెడ్డి ని పార్టీలో తీసుకొచ్చినది షబ్బీర్ అలీ. వీరిద్దరిది గురు శిష్యుల బంధం కూడా. కానీ చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెరగటంపై సీనియర్ నేత షబ్బీర్ అలీ అసంతృప్తిగా ఉండగా.. భవిష్యత్తులో తనకు పోటీ వచ్చే చాన్స్ ఉందని భావించినట్లు టాక్. ఇదే క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇటీవల షబ్బీర్ అలీ వర్గీయులు చంద్రశేఖర్ రెడ్డిపై గాంధీ భవన్ లో క్రమ శిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. సీనియర్లపై దురుసుగా మాట్లాడటంతో పాటు చంద్రశేఖర్ రెడ్డిపై ఉన్న కేసులను ప్రస్తావించారు. ఆయనతో పార్టీకి నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ కోవర్టు అని ఆరోపించారు. ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్రమశిక్షణ కమిటీ గత వారంలో చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన హాజరై వివరణ కూడా ఇచ్చారు. మరోవైపు షబ్బీర్ అలీపైనా చంద్రశేఖర్ కూడా ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబీకులతో పార్టీకి నష్టం జరుగుతుందని క్రమశిక్షణ కమిటీ వద్ద చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ఆడియో వైరల్.. వేడెక్కిన వివాదం
ఇదిలా ఉండగానే కొన్ని రోజుల కింద ఒక ఆడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. షబ్బీర్ అలీతో కాంగ్రెస్ కార్యకర్త మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డు గా తెలిసింది. అందులో పార్టీని ఉద్దేశించి షబ్బీర్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు చంద్రశేఖర్ రెడ్డిని దూషిస్తున్నట్లు ఉంది. ఇదే విషయంపై చంద్రశేఖర్ రెడ్డి భార్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడియో రికార్డింగ్ లో మహిళలను కించపరిచే విధంగా షబ్బీర్ వ్యాఖ్యానించాడని పేర్కొంది. అంతేకాకుండా కామారెడ్డి కాంగ్రెస్ అఫిషియల్ పేజీలో తనపై అసభ్యకరంగా షబ్బీర్ అనుచరులు పోస్టులు పెడుతున్నారని, ఆయన ప్రోత్సహిస్తున్నారని ఎస్పీకి కంప్లయింట్ చేశారు. షబ్బీర్ అలీపైనా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. కౌంటర్ గా షబ్బీర్ అలీ వర్గీయులు మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సందీప్ తోపాటు మరికొందరు మాట్లాడుతూ.. చంద్రశేఖర్, ఇందుప్రియను హెచ్చరించారు . ‘‘పెద్ద నేతలపై ఆరోపణలు చేస్తే పెద్దవారు కాలేరు. అది మీ పతనానికి దారితీస్తుంది. బీఆర్ఎస్ బహిష్కరిస్తే మీకు రాజకీయ భిక్ష పెట్టింది షబ్బీర్ అలీ” అని పేర్కొన్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దీంతో కామారెడ్డిలో కాంగ్రెస్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇద్దరు నేతల్లో ఒకరిపై పార్టీ వేటు వేస్తుందని చర్చ నడుస్తుంది. మొత్తంగా ఇరువురి మధ్య వివాదం పార్టీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్తితి క్యాడర్ లో నెలకొంది.

