Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో మేయర్ ఉమారాణి పర్యటన.. మౌలిక వసతులపై సమీక్ష

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల అందజేత లక్ష్యంగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి (Mayor Umarani) 3, 7, 39 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.

తాగునీటి సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలు, డ్రైనేజీ కాలువల నిర్వహణ లోపాలు, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును ఓపికగా విన్న మేయర్, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన మేయర్, నగర పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.

చెత్త సేకరణ, కాలువల శుభ్రత, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరాను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ (Mayor Umarani) మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం నగర పాలక సంస్థ ముఖ్య బాధ్యత అని అన్నారు. ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, సమస్యలు ఉన్న చోట వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఏఎంసీ నజీర్, స్థానిక కార్పొరేటర్లు, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సంబంధిత కాలనీవాసులు పాల్గొన్నారు.

Read Also: ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>