కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు, ప్రధాన ఆస్పత్రుల పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా క్వాలిటీతో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రుల పనులను వేగవంతం చేసి ఈ ఏడాదిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఈ మేరకు సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సుమారు మూడున్నర గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆల్వాల్ టిమ్స్ ఆస్పత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ, కొత్త హైకోర్టు భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు.

