కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తా (Collector Kushboo Gupta) అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం భూత్పూర్ మండలంలోని పోతులమడుగు ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, మూసాపేట మండలంలోని కొమిరెడ్డి పల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం తాటికొండ గ్రామంలోని నరహరి పారాబాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించి లారీల నుంచి వరి ధాన్యం బస్తాల అన్‌లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు.
ముందుగా పోతులమడుగు గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన కలెక్టర్, వారు ఏమైనా సమస్యలు ఎదుర్కుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే వరి కొనుగోళ్లు ఐకేపీ సభ్యుల ద్వారానే జరుగుతుందా? బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా? అని ఆరా తీశారు. ప్రతి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వి.ఓ.ఎ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ కోసం టెంట్ల ఏర్పాటు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వరి కొనుగోలు అనంతరం రైతులకు వెంటనే కొనుగోలు పత్రం జారీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు గన్నీ సంచులు, వరి రవాణాకు మరిన్ని లారీలు అవసరమని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్, డి సి.ఎస్. ఓ , డి.ఎం సివిల్ సప్లైస్ అధికారులను వెంటనే వాటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అనంతరం మూసాపేట మండలంలోని కొమిరెడ్డి పల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, రైతులతో మాట్లాడి వరి సకాలంలో కొనుగోలు అవుతోందా?, డబ్బులు ఖాతాల్లో ఎన్ని రోజుల్లో జమ అవుతున్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వరి శుభ్రపరిచే విధానాన్ని పరిశీలించడంతో పాటు తేమ శాతాన్ని కూడా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో పెట్టుకోవాలని, తగిన సంఖ్యలో గన్ని బస్తాలను, అలాగే అవసరం మేరకు లారీలను ఏర్పాటు చేసి లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రహదారుల వెంట ఉన్న వరి కుప్పలను ముందుగా కొనుగోలు చేసి, ఐదు నుంచి ఆరు రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అకాల వర్షాల నుంచి వరిని రక్షించేందుకు తగినన్ని టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. రైతులు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు మరిన్ని గన్నీ సంచులు కావాలని కోరగా, అదనంగా 6 వేల గన్నీ సంచులు వెంటనే అందుబాటులోకి తేవాలని డీఎం సివిల్ సప్లైస్, సంబంధిత అధికారులను ఆదేశించారు.
తరువాత భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలోని నరహరి పారా బాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించిన కలెక్టర్, లారీల నుంచి వరి అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మిల్లర్లతో మాట్లాడి మరిన్ని హమాలీలను, లారీలను ఏర్పాటు చేసి అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అలాగే మిల్లర్ ట్రక్ షీట్లను ఓపీఎంఎస్ యాప్‌లో వెంటనే అప్‌లోడ్ చేసి క్లియర్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ డి.ఏం. రవి నాయక్, భూత్పూర్ , మూసాపేట తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

