కలం, ఖమ్మం బ్యూరో: చికాగో వీరుల త్యాగ ఫలమే ప్రపంచ కార్మిక వర్గానికి దిక్సూచి అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం 141వ మేడే ఉత్సవాలు శుక్రవారం ఖమ్మం నగరంలో (Khammam) సీపీఐ, ఏఐటీయూసీ, అనుబంధ ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రధాన కూడళ్లు, హమాలీ అడ్డాలు, ఆటో స్టాండ్‌లు, భవన నిర్మాణ కార్మిక క్షేత్రాలు, యూనియన్, పార్టీ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సాబీర్ పాషా ఎర్రజెండాను ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోస్టాఫీసు సెంటరులో నిర్వహించిన భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలోని పాలకులు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక చట్టాలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.
మే డే స్ఫూర్తితో..
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దేశ ప్రయోజనాలకు విఘాతమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా అన్నారు. ఈ దుర్మార్గపు విధానాలపై కార్మికులు ఐక్యంగా పోరాడాలని కోరారు. మేడే స్ఫూర్తితో అన్యాయమైన విధానాలను ఎదిరించి, పని భద్రత, కనీస వేతనాల సాధన కోసం మరో పోరాట దశకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 723 కేంద్రాల్లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి చికాగో అమరవీరుల త్యాగాలు గుర్తుచేసుకున్నామని తెలిపారు.

