కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంచలన పథకాన్ని ప్రకటించారు. పిల్లలు భారం కాదు, వారే అసలైన సంపద అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును పెంచే లక్ష్యంతో, ఎవరైనా దంపతులు మూడో బిడ్డకు జన్మనిస్తే ప్రభుత్వం రూ. 30,000, అలాగే నాల్గవ బిడ్డ జన్మిస్తే రూ. 40,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం వెల్లడించారు. పిల్లలు కనడం భారం కావొద్దన్నారు. మానవ వనరులే రాష్ట్ర భవిష్యత్తుకు నిజమైన పెట్టుబడి అని నిరూపించడానికే ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) జనాభా సమతుల్యతను కాపాడటం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు పడిపోతుండటం వల్ల 2047 నాటికి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇది జపాన్, ఇటలీ వంటి దేశాల్లో లాగా భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, శ్రామిక శక్తిని దెబ్బతీస్తుందన్నారు.

