నల్లగొండలో అంగన్‌వాడీ అభివృద్ధి పేరుతో నిధుల దోపిడీ

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలోని అంగన్‌వాడీ(Anganwadi) కేంద్రాలలో ఫ్యాన్‌లు , ట్యూబ్‌లైట్ల కొనుగోళ్ల పేరుతో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పసిపిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు అవినీతి అక్రమాలకు అడ్డాగా మారాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో అంగన్‌వాడీల అభివృద్ధి కోసం మినరల్ ఫండ్స్ నుంచి సుమారు రూ.20 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో 802 కేంద్రాలకు ఫ్యాన్‌లు, 1060 కేంద్రాలకు ట్యూబ్‌లైట్లు సరఫరా చేయాల్సి ఉంది. అయితే టెండర్ నిబంధనల ప్రకారం సరఫరా చేయాల్సిన బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నాసిరకం మోడళ్లను అంటగడుతూ దాదాపు రూ. 10 లక్షల మేర చేతివాటం ప్రదర్శించిన వైనం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

2,243 రూపాయిలు విలువైన ‘క్రాంప్టన్ హైస్పీడ్ హెచ్‌పీ ప్లస్’ ఫ్యాన్‌కు బదులు, కేవలం రూ.1,400 విలువ కలిగిన ‘సీవైండ్’ ఫ్యాన్‌ను సరఫరా చేశారు. ఒక్క ఫ్యాన్‌ కొనుగోలు చేయడంలో కూడా సుమారు రూ.843 లాభం చూస్తూ, మొత్తం రూ.7 లక్షల నిధులను కుంభకోణం చేశారు. రూ.264 విలువైన ‘ఫిలిప్స్ 3-ఇన్-1 ఎల్ఈడీ’ లైట్ల బదులు, మార్కెట్‌లో రూ.110 మాత్రమే విలువ చేసే నాసిరకమైన స్లిమ్ మోడళ్లను సరఫరా చేశారు. ఇందులో సుమారు రూ.2 లక్షల నిధులు దోపిడీకి గురయ్యాయి.

ఏప్రిల్‌లో జరగాల్సిన సరఫరాను వేసవి సెలవుల వరకు సాగదీశారు. అంగన్‌వాడీ కేంద్రాలు మూసివుండటంతో నాణ్యత తనిఖీ లేదు. జిల్లా కొనుగోలు కమిటీ పర్యవేక్షణ లేకుండా, సెక్టార్ ఆఫీసులకు నేరుగా మెటీరియల్ పంపి, సూపర్వైజర్‌ల  ద్వారా సంతకాలు తీసుకోవడం నెట్‌వర్క్‌లో జరిగిందని సమాచారం. ఈ అవినీతికి ఐసీడీఎస్ కార్యాలయంలో పని చేస్తున్న ఒక డిప్యూటేషన్ ఉద్యోగి ప్రధాన పాత్ర వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ బి.చంద్రశేఖర్ స్వయంగా ఫిట్టింగ్ చార్జీలు కూడా ఇచ్చే హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయి అధికారులు నిధులను అక్రమంగా వినియోగించారు. నాణ్యత లేని ఫ్యాన్‌లు, ట్యూబ్‌లైట్ల వల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? చిన్నారుల భవిష్యత్తు కోసం కేటాయించిన నిధులను దోపిడీ చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి రికవరీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>