కలం, వెబ్ డెస్క్: ఎస్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ “ఛలో హైదరాబాద్” మహా ధర్నాను చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బంజారాల పేరిట హైదరాబాద్ లో బంజారాహిల్స్ అనే ప్రాంతం ఉంది కానీ.. బంజారాలకు అక్కడ గజం జాగా కూడా ఉండేది కాదని అన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడి.. ఒక ఎకరం స్థలం ఇప్పించి బంజారాల ఆత్మ గౌరవ భవనాన్ని అద్భుతంగా కట్టించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో చిన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. లంబాడీల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆర్ అని.. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా జరిపామని చెప్పారు. టీఎస్ ప్రైడ్ ద్వారా 13,200 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు కట్టించామని అన్నారు. సేవాలాల్, కుమురం భీం, ఏకలవ్య కార్పొరేషన్లకు ఇప్పటి ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.

