కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని (Chairperson Post) దక్కించుకోవాలనే ఆశతో ఓ టీడీపీ నాయకుడు వేసిన రాజకీయ వ్యూహం చివరకు బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని సాలూరు మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాలూరు (Salur) మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో ఆ పదవిని దక్కించుకోవాలని టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రయత్నించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా తన ప్రియురాలు మంజీర(Manjeera)ను హడావుడిగా ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అనంతరం ఆమెను చైర్‌పర్సన్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా సాలూరు చైర్‌పర్సన్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో హర్షవర్ధన్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో మంజీరను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు.
ఆమె గెలుపు కోసం హర్షవర్ధన్ ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం ఆమెకు మద్దతు పలకలేదు. దీంతో మంజీర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు హర్షవర్ధన్ మాత్రం 21వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. చైర్‌పర్సన్ పదవి (Chairperson Post) లక్ష్యంగా సాగిన ఈ రాజకీయ ప్రయత్నం చివరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read : రూ.60 కోట్ల మిర్చి ఎగుమతులకు బ్రేక్.. కేంద్రం సాయం కోరిన సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp

