కలం, వెబ్ డెస్క్ : విదేశీ ఎగుమతుల కోసం పంపిన మిర్చి కంటైనర్లు శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోవడంతో రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Union MinisterPiyush Goyal) కు బుధవారం లేఖ రాశారు.
తక్షణమే చర్యలు తీసుకుని మిర్చి ఎగుమతులకు (Chilli Export) ఎదురైన అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ తదితర దేశాలకు చేరాల్సిన 150కి పైగా మిర్చి కంటైనర్లు కొలంబో పోర్టులోనే నిలిచిపోయాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కంటైనర్లలో ఉన్న మిర్చిలో తేమ శాతం అనుమతించిన పరిమితి కంటే అధికంగా ఉందనే కారణంతో దిగుమతి చేసుకునే దేశాలు సరుకును స్వీకరించేందుకు నిరాకరిస్తున్నాయని వివరించారు.
దీంతో దాదాపు రూ.60 కోట్ల విలువైన మిర్చి సరుకు పోర్టులోనే ఉండిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం వల్ల రైతులు, ఎగుమతిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత దేశాల ప్రభుత్వాలతో కేంద్రం దౌత్యపరమైన సంప్రదింపులు జరిపి కంటైనర్లను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి మిర్చి రైతులు, వ్యాపారులకు ఆర్థికంగా ఊరట కల్పించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

