కలం, వెబ్ డెస్క్: ఏపీలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ (Margani Bharat) డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర రావు సారథ్యంలో సబ్ కలెక్టరేట్ వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా చేరుకుని అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు
కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఇది ప్రభుత్వ పాలకుల అసమర్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు దారుణంగా పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు. పక్కనున్న తమిళనాడు కంటే 5 నుంచి 6 రూపాయలు ధరలు ఎక్కువగా ఉంటే సీఎం చంద్రబాబు ధరలు తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పార్టీ ఇచ్చిన మద్ధతుతోనే కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకలేకపోవడం దారుణమమని చెప్పారు. చంద్రబాబు పాలన అంటేనే మాయ, అబద్ధాలు అని విమర్శించారు. ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ప్రజల పక్షాన వైయస్ఆర్ సీపీ నిలబడి పోరాటం చేస్తుందన్నారు.

