కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) శివారులో జరిగిన ఘోర విషాదం.. మరో రణరంగం సృష్టించింది. కరీంనగర్ శివారులో మరణించిన ట్రాక్టర్ డ్రైవర్ గున్నాల హరీష్ బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగడం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపి విఫలం కావడంతో సమీపంలోని మంచిర్యాల ప్రధాన చౌరస్తాలో దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో అటు మంచిర్యాల, ఇటు చొప్పదండి, కరీంనగర్ (Karimnagar) వైపు దారి పొడవునా వాహనాలు స్తంభించాయి. ట్రాక్టర్ డ్రైవర్ మరణానికి కరీంనగర్ రూరల్ ఎస్సై నరేష్ రెడ్డి కారణమంటూ బంధువులు ఆరోపించారు. ఆయన మరణానికి బాధ్యతగా పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి ఎస్సై ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
చివరికి కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో పోలీసులు బలగాలు రంగ ప్రవేశం చేసి వారిని బలవంతంగా అరెస్టు చేశారు. మద్దతు పలికిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు స్థానిక నాయకులను అరెస్టు చేశారు. ఘటన జరిగి ఆస్పత్రిలో బంధువులు, గ్రామస్తులుండగా పోలీసులు అరెస్టు చేసేంత వరకు కరీంనగర్ రూరల్ సిఐ, ఎస్సై గానీ ఎవరూ అక్కడికి రాకపోవడం గమనార్హం. కరీంనగర్ శివార్లలో తెల్లవారుజామున పోలీసుల తనిఖీలను చూసి భయపడి, వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పొలాల గుండా ట్రాక్టర్ లైట్లు ఆపేసి వెళ్తుండగా.. బండరాయిని ఢీకొట్టి ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ రూరల్ ఎస్ఐ నరేష్ సోమవారం తెల్లవారుజామున కరీంనగర్ బైపాస్ రోడ్డు మీదుగా గోపాల్ పూర్ జాతర వద్ద బందోబస్తు పర్యవేక్షణకు వెళ్లారు.
ఈ క్రమంలో గోపాలాపూర్ సమీపంలోని హైవేపై అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న కొన్ని ట్రాక్టర్లను పోలీసులు నిలువరించారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న మరో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ గున్నాల హరీష్ పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ బండరాయిని బలంగా ఢీకొట్టడంతో హరీష్ కు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, మృతుడి తల్లిదండ్రులు, బంధువులు హరీష్ ను పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రిలో పోలీసుల చర్చలు..
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హరీష్ బంధువులు , గ్రామస్తులు పోలీసులతో చర్చలు జరిపారు. మరణించిన వ్యక్తిని బంధువులకు తెలియకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఎస్సై ప్రమేదం ఉందని నిలదీశారు. మృతుడి కుటుంబానికి పోలీసులతో ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. చర్చలు విఫలం కావడంతో చట్టప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చివరికి పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు, గ్రామస్తులు మంచిర్యాల చౌరస్తాలో ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు మరోసారి మాట్లాడుకుందామని వారిని పిలిచినట్లు సమాచారం.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి- మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో ఆందోళనకు దిగిన హరీష్ బంధువులను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించి బాధితులకు భరోసానిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, హరీష్ మరణంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన ట్రాక్టర్ డ్రైవర్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడని, అతనికి ఇద్దరు చిన్నపిల్లలున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకుని న్యాయం చేయాలని మనోహర్ రెడ్డి కోరారు.

