కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు (Maoist Party Senior Leaders) తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఇందులో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు కాగా మరో ఇద్దరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు. ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులపై తలా రూ. 25 లక్షల రివార్డు ఉండగా, మరో ఇద్దరు రాష్ట్రకమిటీ సభ్యులపై తలా రూ. 20 లక్షల రివార్డు ఉన్నది. నలుగురూ ఒకేసారి లొంగిపోవడంతో తెలంగాణకు చెందిన లీడర్లు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఇద్దరే ఉన్నారని డీజీపీ తెలిపారు. లొంగిపోయినవారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (Devji), పోలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (Sangram), తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (Damodar), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న (Ganganna) ఉన్నారు.
దశాబ్దాల అజ్ఞాత జీవితానికి స్వస్తి :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) 1978లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాదాపు 44 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితంలో ఉన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఎన్‌కౌంటర్ లో 2024 మే 21న మృతి చెందిన తర్వాత తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డి (76) అలియాస్ సంగ్రామ్ 1974లో రాడికల్ విద్యార్థి సంఘం ద్వారా పార్టీలోకి వెళ్లిపోయారు. దాదాపు 46 సంవత్సరాలుగా అజ్ఞాతజీవితం గడిపిన ఆయన ప్రస్తుతం పోలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల, కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (47) పదవ తరగతి చదువుతూనే 1996లో పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరు గ్రామానికి చెందిన నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న (62) జననాట్యమండలి ద్వారా 1990లో పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ నలుగురూ ఒకేసారి తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు.

Read Also: అంబులెన్స్ రాలేదు.. ఎడ్లబండిపై భార్యను తీసుకెళ్లిన భర్త..
Follow Us On: X(Twitter)

