కలం, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేరళ రాష్ట్రం పేరు (Keralam) మార్చాలంటూ ఆ రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి అంగీకరించింది. దీనితోపాటు విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం తెలిపింది. అలాగే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్2కు, గోండియా–జబల్పూర్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులతోపాటు మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఓకే చెప్పింది.
కేబినెట్ ఆమోదంతో ఇకపై కేరళ అధికారికంగా కేరళంగా మారనుంది. పేరు మార్పుపై చాలా ఏళ్లుగా ఆ రాష్ట్రం నుంచి కేంద్రానికి తీర్మానాలు, విజ్ఞప్తులు అందాయి. వందల ఏళ్ల నుంచే కేరళ పేరును మలయాళంలో కేరళం అని పిలిచేవాళ్లని ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండేళ్ల కిందట.. పేరు మార్పుపై తీర్మానం సందర్భంగా చెప్పారు. బ్రిటిషర్లు కేరళమ్ అని పలకలేక కేరళగా మార్చారని అన్నారు. ఈ విషయంలో కేరళలో(Keralam) రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభించింది.
కాగా, ఏదైనా రాష్ట్రం పేరు మార్చాలంటే ఆ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి, ఆమోదించాలి. అనంతరం రాష్ట్రపతి ఆమోదం తీసుకొని, పార్లమెంట్లో బిల్లు పెడతారు. ఈ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ చాలు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఆర్టికల్ 3 ప్రకారం సాధారణ చట్టం ప్రకారమే చేయొచ్చు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత అధికారికంగా అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరు మారుతుంది.

