కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. గురువారం మణుగూరు పోలీసులు చేపట్టిన వ్యూహాత్మక తనిఖీల్లో రూ.40 లక్షల విలువైన 80 కిలోల గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. లగ్జరీ కార్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అంతర్రాష్ట్ర మత్తు దందాను పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో, సీఐ నాగబాబు నేతృత్వంలోని పోలీస్ బృందం మణుగూరు పరిధిలో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న రాజస్థాన్ రిజిస్ట్రేషన్‌కు చెందిన ఒక ఫార్చ్యూనర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. కారును కూలంకషంగా తనిఖీ చేయగా, అందులో సీక్రెట్‌గా దాచి తరలిస్తున్న 80 కిలోల గంజాయి బస్తాలు బయటపడ్డాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు రాజస్థాన్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు గంజాయిని, రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ ముఠా ఒడిశా ప్రాంతం నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. స్థానిక రూట్లను వాడుకుంటూ పోలీసుల కన్నుగప్పేందుకు వీరు పక్కా ప్లాన్ వేసినట్లు సమాచారం. డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న మణుగూరు పోలీసులను, ఉన్నతాధికారులను స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
మణుగూరులో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్!

